
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్ హిల్స్ జలమండలి జీఎం అనంత లక్ష్మి కుమార్ నివాసంతో పాటు బంధువుల ఇళ్లతో కలిపి మొత్తం 8 చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ ఫోకస్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారి లక్ష్యంగా యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు దాడులు చేపట్టారు. రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ లక్ష్యంగా ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం ఆకస్మిక దాడులు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 విభిన్న ప్రాంతాలలో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మల్లాపూర్‌లోని జీఎం కుమార్ స్వగృహంలో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ స్వయంగా రంగంలోకి దిగి ఈ తనిఖీలను పర్యవేక్షిస్తున్నారు.

జలమండలి జీఎం కుమార్ నివాసంతో పాటు ఆయనకు అత్యంత సమీప బంధువుల ఇళ్లలోనూ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తనిఖీల్లో అధికారులకు భారీ ఎత్తున నగదు పట్టుబడింది. ఇంట్లో కుప్పలుగా పడి ఉన్న నోట్ల కట్టలను చూసి ఏసీబీ అధికారులే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. స్వాధీనం చేసుకున్న నగదు అత్యధికంగా ఉండటంతో, దానిని ఖచ్చితంగా లెక్కించేందుకు అధికారులు ప్రత్యేకంగా క్యాష్ కౌంటింగ్ మెషీన్లను (Cash Counting Machines) తెప్పించారు.
.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..
జలమండలి మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ నివాసాల్లో ఏసీబీ అధికారులు తనికీల్లో 100 కోట్ల ( మార్కెట్ విలువ ప్రకారం ) ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మల్లాపూర్ తో పాటు బంధువుల నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇంట్లో కోటి 10 లక్షల నగదుతో పాటు సుమారు 1 KG బంగారు ఆభరణాలు గుర్తించారు. లభ్యమైన డాక్యుమెంట్స్ ప్రకారం హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటిలలో 3 ఫ్లాట్స్.. 6 ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి. నిజామాబాద్ లో 3 ఎకరాల భూమి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేసి అందులో ఏముందో చెక్ చేయనున్నారు.
పట్టుబడిన ఈ భారీ నగదు, ఇతర ఆస్తుల వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లపై దర్యాప్తు బృందం ప్రస్తుతం ఆరా తీస్తోంది. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు, లభించిన మొత్తం ఆస్తుల విలువ ఎంత అనేది సోదాలు ముగిసిన అనంతరం అధికారులు అధికారికంగా వెల్లడించనున్నారు. జీఎం కుమార్ స్థిర, చరాస్తుల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

వలలో చిక్కిన తిమింగలం