
సరస్వతి అంత్య పుష్కరాల విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది తమ బాధ్యతల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో పుష్కర విధులు కేటాయించిన అధికారులు, సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఈ 12 రోజులు అత్యంత ముఖ్యమైనవని తెలిపారు. గత సంవత్సరం జిల్లాలో భారీ ఎత్తున సరస్వతి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించినట్లు గుర్తుచేస్తూ, అంత్య పుష్కరాలను కూడా అదే స్థాయిలో నిర్వహించాలని అన్నారు.💥💥💥

ప్రతిరోజూ అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి అధికారికి కేటాయించిన విధుల మేరకు ఆయా ప్రాంతాలను ముందస్తుగా పరిశీలించి ఏర్పాట్లు తనిఖీ చేయాలని ఆదేశించారు. విధులకు గైర్హాజరైన అధికారులు, సిబ్బందికి మెమోలు జారీ చేసి, తగిన చర్యల కోసం సంబంధిత శాఖలకు సిఫారసు చేయనున్నట్లు హెచ్చరించారు.💥💥💥

ఈ నెల 21వ తేదీ ఉదయం 5.30 గంటలకు పుష్కరాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రతి రోజు స్వామీజీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలను సమర్థవంతంగా పర్యవేక్షించాలని అన్నారు.💥💥💥
సమాచారం సమగ్రంగా అందించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వాకీ టాకీల ద్వారా అందే సమాచారాన్ని వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు.
దేవాలయంలో భక్తులు క్యూలైన్లను పాటించేలా చర్యలు తీసుకోవాలని, భక్తులు నదిలోకి వెళ్లకుండా గజ ఈతగాళ్లు, నాటు పడవలతో పహారా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విధులు నిర్వహించే అధికారులు సిబ్బందిని పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.💥💥💥
తాత్కాలిక బస్టాండ్ నుంచి ఘాట్ల వరకు భక్తుల సౌకర్యార్థం ఉచిత షటిల్ బస్సులు నడపాలని అధికారులకు ఆదేశించారు.💥💥💥
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీఆర్వో వసంత కుమారి, భూపాలపల్లి మరియు కాటారం ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్‌తో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
