
బక్రీద్ పండుగను సామరస్య వాతావరణంలో నిర్వహించాలి
-హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్ లతో కలసి అధికారులు, పీస్ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహణ.
త్వరలో జరిగే బక్రీద్ పండుగను శాంతియుతంగా, పరస్పర గౌరవ భావాలతో నిర్వహించేందుకు సహకరించాలని వరంగల్ సిటీ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్ గారు సూచించారు.

సోమవారం హనుమకొండ కలెక్టరేట్ ఐడీఓసీలో హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహాత్ బాజ్‌పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదలతో కలిసి అధికారులు, పీస్ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పండుగ సందర్భంగా చేపట్టాల్సిన శాంతిభద్రతల చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ, ఈద్గాల వద్ద సౌకర్యాల ఏర్పాటుపై వారు సమీక్ష నిర్వహించారు.
మసీదులు, ప్రార్థనా స్థలాలు, ఈద్గాల పరిసరాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్ గారు మాట్లాడుతూ వరంగల్, హనుమకొండ నగరాల్లో ప్రతి పండుగను ప్రజలు సామరస్యంతో జరుపుకుంటారని, అదే స్ఫూర్తితో బక్రీద్ పండుగను కూడా ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. ప్రతి మతానికి సంబంధించిన భావోద్వేగాలను గౌరవించడం పోలీసు శాఖ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా పరస్పర సహకారంతో పండుగను నిర్వహించాలని కోరారు.
జంతువులకు పశుసంవర్ధక శాఖ ద్వారా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. పశువుల వ్యర్థాలను రోడ్లపై వేయకుండా పరిశుభ్రత పాటించాలని, మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ప్రజలను కోరారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, మత విద్వేషాలను రెచ్చగొట్టే సందేశాలు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ హెచ్చరించారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని ఆయన కోరారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయి మాట్లాడుతూ పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.బల్దియా ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గారు మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ ద్వారా బలికి ఉపయోగించే పశువులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు త్వరితగతిన జారీ చేయాలని సూచించారు. ఎవరైనా మనోభావాలు దెబ్బతినకుండా పరస్పర గౌరవంతో పండుగను జరుపుకోవాలని కోరారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు, పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అప్జల్ బియాబాని ఖుస్రో పాషా, డీసీపీలు అంకిత్ కుమార్, ధారా కవిత, రాజమహేంద్ర నాయక్ అదనపు కలెక్టర్లు రవి, సంధ్యారాణి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు, ఏసీపీలు, ఆర్టీవోలు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, శాంతి కమిటీ అధ్యక్షులు డాక్టర్ అనిస్ సిద్ధిక్వి, సభ్యులు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
