
✅ఇందిరమ్మ ఇండ్లకు కేంద్రవాటా కోసం ఎదురు చూస్తున్నాం
✅కేంద్రం ఇవ్వకపోతే మేమే భరిస్తాం
✅15-20 రోజుల తర్వాత ఇండ్లకు ఆపిన మొత్తాన్ని విడుదల చేస్తాం
✅జూన్ 2న రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ప్రారంభం
✅ఈనెల చివరిలోగా భూముల ధరల సవరణ
✅రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

☑️రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇందిరమ్మ ఇండ్ల పధకం కింద కేంద్ర ప్రభుత్వ వాటాగా రావలసిన నిధుల కోసం ఈ ఏడాది మార్చి నుంచి ఎదురుచూస్తున్నామని, కేంద్రం ఒక్కో ఇంటికి సుమారు 1లక్షా13 వేల రూపాయిల వాటా విడుదల కావాల్సి ఉందని కేంద్రం నుంచి నిధుల వస్తాయన్న నమ్మకంతో ఇందిరమ్మ లబ్దిదారులకు ఫైనల్ బిల్ ఆపడం జరిగిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతానికి ఒక ఇల్లు కూడా మంజూరు కాలేదని తెలిపారు.
☑️శనివారం నాడు తన ఛాంబర్లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధుల కోసం పలుమార్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిగారితో పాటు తాను కూడా ప్రాతినిధ్యం చేశామని చెప్పారు. ఆ నిధుల విడుదల కోసం ప్రయత్నిస్తూ మరోవైపు ప్రస్తుతం పూర్తయిన ఒక్కో ఇంటికి 1.60 లక్షల రూపాయిలను తాత్కాలికంగా ఆపామని , ఒకవేళ కేంద్రం మరో 15-20 రోజుల్లోగా విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే భరించి లబ్దిదారులకు నిధులు అందజేస్తుందని స్పష్టం చేశారు.
☑️రాష్ట్రంలో తొలివిడత మూడున్నర లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా ఇంతవరకు సుమారు 1.32 లక్షల ఇండ్లు పూర్తయ్యాయని, జూన్ నెలాఖరుకల్లా 68-72 వేల ఇండ్లు శ్లాబ్‌ల నిర్మాణం పూర్తవుతుందన్నారు.

☑️రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పధకాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూన్ 2న ఆదిలాబాద్‌లో ప్రారంభిస్తారని తెలిపారు. 2వ విడత మంజూరులో వివిధ రకాల వెసులుబాట్లను కల్పిస్తామని అన్నారు. గోడలు, బేస్మెంట్ లెవెల్, శ్లాబ్ వరకు ఉన్న గోడలు, శ్లాబ్ లేని ఇండ్లకు కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు మంజూరు చేయాలనే అంశాన్ని కూడా ఈనెల 21న క్యాబినెట్లో చర్చించి ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
☑️గత 25 రోజులుగా రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల పరిధిలో రెవెన్యూ, హౌసింగ్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ , సర్వే అంశాలపై విస్తృతంగా చర్చించాం. ప్రజా ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించి కొన్ని విషయాలపై అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకొని పరిష్కరించాం.
☑️ఈ సారి ప్రత్యేకంగా కలెక్టర్లు లేదా అదనపు కలెక్టర్లు, డిఎఫ్ఓలను సమావేశపరిచి రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులపై చర్చించి రోవర్ల సాయంతో సరిహద్దుల గుర్తింపుపై ఒక అవగాహన కల్పించాం. సరిహద్దులను కచ్చితంగా ఖరారు చేసేలా ఆదేశించాం. 1/70 సమస్యపై కూడా చర్చించాం. రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల నుంచి రెవెన్యూ ఫారెస్ట్ మధ్య భూ సరిహద్దు వివాదాలు ఉన్నాయని వీటి పరిష్కారానికి జయింట్ సర్వే నిర్వహించి శాశ్వ పరిష్కారం చూపబోతామన్నారు.
☑️రాష్ట్రంలో ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను గుర్తించి సమగ్ర సర్వే కార్యక్రమం చేపడతాం. రిజిస్ట్రేషన్ల సమయంలో సర్వర్ల డౌన్ అంశంపై దృష్టి సారించి కొత్త సాఫ్ట్ వేర్ ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. సుమారు 14.08 కోట్లతో టెండర్ ఖరారు అయింది. మరో 3-4 నెలల్లో ఈ సమస్య తీరుతుంది.
☑️గత ప్రభుత్వహయాంలో అసంపూర్తిగా ఉండిపోయిన 2బిహెచ్కే ఇండ్లకు సంబంధించి పాతరేట్లతో పూర్తి చేసేలా కాంట్రాక్టర్లను కోరాం. అత్యధిక శాతం ఈ పనుల పూర్తికి ముందుకు రానందున లబ్దిదారులను ఎంపిక చేసి వారికే మిగిలిన మొత్తాన్ని ఇస్తూ వారిచేతనే పూర్తిచేయించేలా నిర్ణయించాం. ఈమేరకు ఈనెలాఖరులోగా ఇటువంటి ఇండ్లను గుర్తించేలా కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం.
☑️పలు ప్రాంతాల్లో పదికిపైగా ఇండ్లు కలిగిన టవర్లను గుర్తించి వాటికి పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ, వాటి దిగువ కమర్షియల్ షాపులను లీజుకు బదులు పూర్తిగా బహిరంగ వేలంలో విక్రయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వ ప్రాతినిధ్యం కలిగిన పాలక వర్గం ఎకౌంట్లో వేయాలని నిర్ణయించాం.
☑️ రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని కొన్ని ప్రాంతాల వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్దీకరించాలని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.
☑️దీనికి అనుగుణంగా ఈనెల చివరిలోగా భూముల ధరలను సవరించి అమలులోకి తీసుకువస్తామని వెల్లడించారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో 2022 సంవత్సరంలో ఆరునెలలు తిరగకుండానే రెండు సార్లు భూముల ధరలను అశాస్త్రీయ పద్దతిలో పెంచారని అన్నారు.
☑️ఆర్ధిక నిపుణులైన అరవింద్ సుబ్రహ్మణ్యం గారి సలహాలు, సూచనల మేరకు శాస్త్రీయ పద్దతిలో విశ్లేషించి భూముల ధరలను సవరిస్తున్నామని వెల్లడించారు.
☑️గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు సుమారు 38 వేల ఇండ్లకు లబ్దిదారులను ఖరారు చేసింది. తర్వాత ఏడాది పాటు సైంటిఫిక్ సర్వే నిర్వహించగా వీరిలో సుమారు 16వేల మంది అసలు ఆ ఇండ్లలో దిగలేదని తేలింది. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉంటూ రోజూ సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించలేని పేదలకు వారు ఉన్న ప్రాంతాలకు సమీపంలోనే ఇండ్లను కేటాయించాలని నిర్ణయించాం. అర్హులను ఎంపిక చేసి యుద్ధ ప్రాతిపదికన కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. జిహెచ్ ఎంసీ పరిధిలో మూడు కార్పోరేషన్లలో పేదలకు ఇండ్ల సౌకర్యం కల్పిస్తాం.
☑️ ఒకే స్ధలంలో అన్నదమ్ములు ఇందిరమ్మ ఇండ్లను వన్ ప్లస్ వన్ పద్దతిలో కట్టుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాం. సుమారు 40-50 ఏళ్ల క్రితం కట్టిన వాంబే,ఎన్ ఆర్ జే ఎ ఎం ఎస్ తదితర కాలనీల్లో ఇండ్లు కూలిపోయే స్ధితికి చేరుకుంటున్నాయి. వాటి స్ధానంలో కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు పరిశీలిస్తున్నాం.
☑️ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లబ్దిదారులు స్ధానికంగా ఇసుకను ఉచితంగా పొందేలా, ఎర్త్ ఫిల్లింగ్ కుకూడా మట్టిని పొందేలా అవకాశం ఇవ్వాలని, ఎటువంటి అభ్యంతరాలు తెలుపకూడదని అధికారులను ఆదేశించాం.
☑️ గతంలో ప్రైవేటు భూములను సేకరించి ఇండ్ల నిర్మాణానికి లేఅవుట్లు వేశారు. వాటిలో కొన్ని ఖాళీలు ఉన్నాయి, మరికొన్ని చోట్ల కబ్జాకు గురయ్యాయి. ధరణి కారణంగా గతంలో భూమి అమ్మిన వ్యక్తి పేరిటే మళ్లీ సదరు భూమి ఉన్నట్లు రావడంతో సమస్యలు మొదలయ్యాయి. ఇటువంటి అంశాలపై సమగ్రనివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించాం. కబ్జాదారులను , ప్రభుత్వ భూమిని వదిలే ప్రసక్తే లేదు. అవసరమైన చోట ప్రభుత్వ భూములకు ప్రహారీతో రక్షణ కల్పిస్తాం.
☑️ పాలేరు నియోజకవర్గాన్ని 20 వేల ఓటర్ల చొప్పున 14 క్లస్టర్లుగా విభజించి ఇప్పటి వరకు 13 ప్రాంతాలలో ప్రజా దర్బార్ నిర్వహించాం. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా 52 శాతం ఇందిరమ్మ ఇండ్ల కోసమే ఉన్నాయి. తర్వాత స్ధానంలో ధరణి వల్ల ఏర్పడిన భూ సమస్యలు,ఆసరా పెన్షన్లు, గృహలక్ష్మి, గ్యాస్ సబ్సిడీ, రేషన్ కార్డులలో కుటుంబీకుల పేర్ల చేర్పు వంటివి ప్రాధాన్యతా క్రమంలో ఉన్నాయన్నారు. ఆసరా పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కచ్చతమైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
