
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యి తెలంగాణ అభివృద్ధి, విద్యా రంగంలో భారీ పెట్టుబడులు, మూలధన వ్యయాలకు అదనపు ఆర్థిక సహాయం కోరిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
✅ఎస్‌ఏఎస్‌సీఐ(SASCI) కింద రూ.5,000 కోట్ల ప్రత్యేక సహాయం – విద్యా రంగ పెట్టుబడులకు FRBM మినహాయింపు కోరుతూ వినతిపత్రాలు సమర్పణ.

✅తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ను కలిసి రాష్ట్ర అభివృద్ధి, విద్యా రంగంలో చేపడుతున్న భారీ పెట్టుబడులు, మూలధన వ్యయాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
✅ఈ సందర్భంగా “Scheme for Special Assistance to States for Capital Investment (SASCI)” కింద తెలంగాణ రాష్ట్రానికి అదనంగా రూ.5,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా రాష్ట్రాలకు 50 ఏళ్ల వడ్డీ లేని రుణాల రూపంలో అందిస్తున్న సహకారానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు ఇప్పటికే రూ.4,208 కోట్లు మంజూరైన విషయాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు మరింత ఆర్థిక మద్దతు అవసరమని వివరించారు.

✅తెలంగాణ దేశంలో నూతనంగా ఏర్పడిన రాష్ట్రాలలో ఒకటిగా వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, 2014 నుంచి 2023 మధ్య ప్రత్యేక ప్రయోజన సంస్థలు (SPVs) ద్వారా చేపట్టిన అప్పుల భారం, వాటి చెల్లింపుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అయినప్పటికీ విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో పెట్టుబడులు కొనసాగిస్తోందని తెలిపారు.
✅ప్రత్యేకంగా “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (YIIRS)” ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించారు. జిల్లాల వారీగా కొత్త మెడికల్ కళాశాలలు, గ్రామీణ ఆరోగ్య సేవల విస్తరణ, విద్యా మౌలిక వసతుల బలోపేతం వంటి కార్యక్రమాలు సామాజిక సమానత్వంతో కూడిన సుస్థిర అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.
✅అదేవిధంగా, విద్యా రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న భారీ పెట్టుబడులకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రికి మరో వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ రూపాంతరానికి మొత్తం రూ.30,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళిక రూపొందించిందని, ఇందులో రూ.21,000 కోట్లతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ క్యాంపస్‌ల నిర్మాణం, మరో రూ.9,000 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, సాంకేతిక విద్యాసంస్థలు, డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధి చేపడుతున్నట్లు వివరించారు.

✅ఈ క్రమంలో ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) సహకారంతో రూ.4,049.11 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రాజెక్ట్, ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (AIIB) సహకారంతో రూ.4,903.44 కోట్ల వ్యయంతో తెలంగాణ ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడేషన్ మిషన్ ప్రాజెక్టులకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (DEA) ఆమోదం తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
✅ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన రుణాలను రాష్ట్ర FRBM పరిమితుల నుంచి మినహాయించాలని ఉప ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇవి సాధారణ ఖర్చులు కాకుండా, భవిష్యత్ తరాల మానవ వనరుల అభివృద్ధికి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యా సాధికారతకు దోహదపడే దీర్ఘకాలిక మూలధన పెట్టుబడులని పేర్కొన్నారు.
✅“వికసిత భారత్–2047” లక్ష్య సాధనలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విద్యా, మౌలిక వసతుల పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని, కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన మద్దతు లభిస్తే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
✅ఉప ముఖ్యమంత్రి గారి వెంట ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ డా. గౌరవ ఉప్పల్ ఉన్నారు.
