
హైదరాబాద్‌లో విలాసవంతమైన గడియారాల అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో రోలెక్స్ వాచీలతో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ముంబైకి ఈ గడియారాలను రహస్యంగా తరలిస్తూ ఉండగా అధికారులు తనిఖీల్లో పట్టుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుల వద్ద నుండి మొత్తం 30 రోలెక్స్ గడియారాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ గడియారాల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.18 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారం గుట్టుగా చాలా కాలంగా సాగుతున్న దందాగా అనుమానిస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న గడియారాలు నిజమైన రోలెక్స్ బ్రాండ్‌కు చెందినవా లేదా నకిలీ (పైరేటెడ్) గడియారాలా అనే అంశంపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. గడియారాల కొనుగోలు, సరఫరా, విక్రయాల వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అక్రమ రవాణా వ్యవహారంలో మరికొందరు వ్యక్తులు కూడా పాల్గొన్న అవకాశాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
_Islavath Ramesh
*State Bureau, *
